అతడిని కాపీ కొట్టా: నితిన్‌

యంగ్‌ హీరో నితిన్ తాజా చిత్రం 'భీష్మ' బాక్సాఫీస్‌లో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం అసలు సిసలైన కామెడీతో థియేటర్‌లో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతోంది. సితార ఎంటర్‌టైర్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. వివరాల్లోకి వెళితే....   నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే 'భీష్మ'కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్‌ చేస్తుంది, చక్కగా నటిస్తుంది. నితిన్‌తో మేం 'శ్రీనివాస కల్యాణం'తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే హిట్ చేస్తారని ప్రతిరోజూ పండగే, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఇప్పుడు భీష్మ నిరూపించాయి. ఈ సినిమాను యూత్ బాగా ఆదరిస్తున్నారు" అని చెప్పారు.హీరో నితిన్ మాట్లాడుతూ ‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. కన్నీళ్లు కనబడకూడదనే అద్దాలు పెట్టుకున్నా. ఇక రష్మికతో కంటే సంపత్ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. (భీష్మ మూవీ రివ్యూ)