హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు మెట్రో పనులు పూర్తి చేశారు గానీ.. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా మార్గంలో పనులు ఎప్పుడు మొదలుపెడతారని ప్రశ్నించారు. ఈ మేరకు... ‘దార్ ఉల్ షిఫా నుంచి ఫలక్‌నామా మెట్రో లైన్ సంగతి ఏంటి? జేబీఎస్ మార్గాన్ని పూర్తి చేశారు గానీ.. దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఇదైతే ఇంకా అద్భుతం.. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గాన్ని పూర్తి చేయడానికి నిధులు ఉన్నాయి. మరి ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా పనులు ఎప్పుడు మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తి చేస్తార’ని అసదుద్దీన్ ట్విటర్ వేదికగా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యంపై విమర్శనాస్త్రాలు సంధించారు.
కాగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో మార్గాన్ని ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపుగా 40 నిమిషాలకు పైగా సమయం పడుతుంది. అదే మెట్రో రైలు అందుబాటులోకి వస్తే.. కేవలం 15 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల ట్రాఫిక్ సమస్య తీరనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు చేసిన ట్వీట్‌కు అసదుద్దీన్ పైవిధంగా స్పందించారు. నగరంలో 72 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నగరంలో ఏర్పాటు చేయాలనుకున్నా, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నామా మార్గం మాత్రం నిర్మాణ దశలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ 5 కిలోమీటర్లు మినహాయిస్తే హైదరాబాద్‌లో మెట్రోరైల్ నిర్మాణం మొత్తం పూర్తయినట్లే. ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు.